జగన్నాథ పురీ

ఎన్నేళ్ళ నుంచో ఎదురుచూస్తున్న పూరీ యాత్ర ఇన్నాళ్ళకు ప్రాప్తించింది. ఒక్కసారిగా బోలెడు సెలవులు రావడంతో మొన్నామధ్య (మార్చి రెండో వారంలో) పొలోమంటూ backpack వేసుకుని తూర్పుతీర యాత్రకు బయలుదేరాను. రైల్లో హైదరాబాదు నుంచి భువనేశ్వర్ వరకూ one-way మాత్రమే రిజర్వేషన్‌ దొరికింది. నేనింతకుముందెప్పుడూ ఒరిస్సా వెళ్ళకపోయినా ఎలాగోలా మేనేజ్ చెయ్యొచ్చులే అనుకుని బయలుదేరిపోయాను. హైదరాబాదులో East Coast Express పొద్దున పదిన్నరకెక్కితే భువనేశ్వర్ వెళ్ళేసరికి మరుసటిరోజు ఉదయం ఎనిమిదయ్యింది. దిగ్గానే ముందు బస్సు రిజర్వేషన్‌ చేసుకుందామనుకుని ఇక్కడ మెయిన్‌ బస్టాండ్ ఏంటని ఎంక్వైరీ చేస్తే బారాముండ (baramunda) కెళ్ళమని చెప్పారు. యాభై రూపాయలు తీసుకుని ఆటోవాడు పది పదిహేను కిమీల తర్వాత ఓ పాడుబడ్డ బిల్డింగు ముందు ఆపాడు. ఎక్కడా బస్టాండ్ అన్న బోర్డు కూడా లేకపోడంతో ఆటోవాడు మోసం చెయ్యలేదు కదా అనుకుంటూనే లోపలికెళ్ళాను. చూద్దును కదా ఏ యాంగిల్లో కూడా ఒక state capital main bus standలా లేదు. బతుకు బస్టాండ్ అని దీన్ని చూసే అనుంటారు అనిపించింది. అసలు దానికో ఫోటో తీద్దామనిపించింది గానీ అక్కడి జనాలు ఎక్కడ చితక్కొట్టేస్తారో అని ఆగిపోయాను. ఓ మూల Computerized Reservation Counter అని కనిపించడంతో వెళ్ళి వైజాగ్‌కు బస్సులేమైనా వున్నాయా అని అడిగా. వచ్చాడండీ పోటుగాడు అన్నట్టు చూసి రైళ్ళుంటాయి వెళ్ళు అన్నాడు. ఆయనే వుంటే మంగలెందుకనుకొని నా అవస్థ చెప్పుకున్నా. ఆంధ్రావైపు వెళ్ళాలంటే బరంపురం వెళ్ళడమొక్కటే దారి అనడంతో ఆ పాట్లేవో రేపు పడొచ్చని కోణార్క్ వెళ్ళే బస్సులో కూలబడ్డా.

...

డుగ్గుడుగ్గుమంటూ ఆ బండి... సారీ దాన్ని బస్సంటారు... ఆ బస్సు బయలుదేరేసరికి తొమ్మిదిన్నరయ్యింది. ఆ బస్సు 70 కిమీలను రెండున్నర గంటల్లో కవర్ చేసిందంటే ఆశ్చర్యమే. కానీ దారి మొత్తం కనులవిందుగా ఉంటుంది. పచ్చని పల్లెటూళ్ళు... ఎక్కడ చూసినా చిన్నదో, పెద్దదో కాలువో, చెరువో నిండా నీళ్ళతో చూడముచ్చటగా ఉంటుంది. కానీ బస్సులో జనాలను కుక్కెయ్యడంతో ఊపిరాళ్ళేదు. మొత్తానికి పన్నెండింటికి కోణార్క‌లో దింపాడు. గుడి మూసేస్తారేమో అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాక తెలిసింది సూర్యోదయంతో తెరిచిన గుడి రాత్రి ఎనిమిదింటివరకూ మూయరని. గుళ్ళో సూర్యుని విగ్రహం ఉంటుందనుకుంటున్న నాకు గుళ్ళో విగ్రహాన్ని ఎప్పుడో ఎత్తుకెళ్ళిపోయారని, గుడి పడిపోకుండా 1903లో లోపలంతా ఫిల్లింగ్ చేసి మూసేసారనీ, ఇప్పుడు కేవలం గుడి బయటున్న శిల్పకళ మాత్రమే చూడగలమనీ అక్కడి ఓ గైడు చెప్పాడు. సరే అని గంటకు వంద చొప్పున మాట్లాడుకుని ఆయన్నే చూపించమని అడిగాను. ఒక్కొక్కటీ చూసుకుంటూ వెళ్ళేసరికి రెండు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియలేదు.

Front View of Konark Temple

గుడి మొత్తం ఓ రథంలా ఉంటుంది. 24 చక్రాలతో ఏడు గుర్రాలు లాగుతున్నట్టుగా డిజైన్‌ చేశారు. గుర్రాలు శిథిలమైపోయినా చక్రాలు మాత్రం ఇంకా కండీషన్‌లోనే ఉన్నాయి.

IMG_3430 

గుడి ఎదురుగా నాట్య మండపం ఉంది. పాతికేళ్ళ క్రితం వరకూ అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతుంటే జనాలు గుడి గోపురం మీద కూర్చుని చూసేవారట. (గుడి పైకి ఎక్కడానికి వెనుకపైపునుండి మెట్లలాంటి ఏర్పాటుంది, కానీ ఇప్పుడు మూసేసారు.)

 Naatya Mandapam

ఇంకా గుడి చుట్టూ అద్భుతమైన శిల్పకళ ఉంది. అది చూసి తీరవలసిందేగానీ ఇక్కడ వర్ణించడం కుదరదు.   

IMG_3483

గుడి చుట్టూ పెద్ద పెద్ద చెట్లుండడంతో మిట్టమధ్యాన్నం కూడా చల్లటి గాలి వీస్తుంటుంది. ఆ చెట్లకింద కూర్చుని టెంపుల్ వ్యూని ఎంజాయ్ చేయడం మర్చిపోలేని అనుభూతి. నన్నడిగితే ఇక్కడ కనీసం రెండు గంటలు గడిపేట్లు ప్లాన్‌ చేసుకోవాలి. గుడి కాకుండా నాకు బాగా నచ్చింది ఇంకోటుంది. గుడినుంచి బైటకు వెళ్ళేప్పుడు కుడివైపు పెద్ద మర్రిచెట్ల మధ్యలో ఓ చక్కటి టాయ్‌లెట్ ఉంది. Worth paying a visit. గుడి బయటకొచ్చాక వర్సగా కొబ్బరి బోండాలుంటాయి. ఐదు రూపాయలకే అంతటి తియ్యటి కొబ్బరినీళ్లు ఇంకెక్కడా దొరకవు.

...

అయినా పూరీ అని పేరుపెట్టి అంతా కోణార్క్ గురించే రాస్తున్నావేమిటోయ్ అంటారేమో అందుకే ఇక పూరీ బయలుదేరుతాను. అన్నట్టు ఒకవేళ మీరు కోణార్క‌లోనే రాత్రి బస చేయాలనుకుంటే ఫుడ్డుకీ, బెడ్డుకీ బెంగపడక్కర్లేదు. రెండు మూడు లాడ్జీలూ, పది పన్నెండు హోటల్సూ ఉన్నాయి. కాకపోతే స్టార్ రేంజ్ కాదు.

...

కోణార్క్ నుంచి పూరీ 36 కిమీ ఉంటుంది. అరగంటకో బస్సు ఉంటుందట. బస్సులో ఎడమవైపు కూర్చుంటే ఓ పది నిమిషాలు సముద్రం వ్యూని ఎంజాయ్ చెయ్యొచ్చు (దాన్ని marine drive అంటారట). మిగితా జర్నీ మాత్రం షరా మామూలే. అంతలా జనాల్ని కుక్కడం హైదరాబాదు సిటీబస్సుల్లో కూడా చూడం. ఓ రెండుగంటల తర్వాత పూరీలో దింపాడు. బస్టాండునుంచి గుడి ఓ రెండు మూడు కిమీలుంటుందేమో. దారిలోనే ఓ లాడ్జిలో 250 రూలకు రూం తీసుకున్నాను. ఇంకా లగ్జరీ లాడ్జీలు కావాలంటే బీచ్ రోడ్డులో ఉంటాయట. రెడీ గిడీ అయి గుడికెళ్ళేసరికి సాయంత్రం ఏడయ్యింది. గుడిలోపలికి కాదుగదా కనీసం దరిదాపుల్లోకి కూడా సెల్‌ఫోన్లు, కెమరాలు తీసుకెళ్ళనివ్వరు. కాబట్టి ఇక్కట్నుంచీ మీకు ఫోటోలూ గీటోలూ ఉండవ్.

...

గుడి నేనకున్నట్టుగానే చాలా మెజస్టిక్‌గా ఉంది. పెద్దగా రద్దీ లేదుగానీ, పూజారులే (పాండాలంటారు) పెద్ద తలనొప్పి. డబ్బుకోసం పీడిస్తారు. ఇక అందరూ అడిగే కామన్‌ ప్రశ్న. తిరుపతిలో వచ్చే ఫీలింగ్ వస్తుందా అని. ఏమో అది చూసేవాళ్ళ దృష్టిలో ఉంటుందని నాకనిపిస్తుంది. ఏదేమైనా ఇక్కడికి వచ్చినవాళ్ళు disappoint మాత్రం అవరు. ఊహించినదానికంటే ఎక్కువే దొరుకుతుంది.

...

ఇక్కడ strikingగా కనిపించేది మహాప్రసాదం. వందల కుండల్లో అన్నం, కూరలూ ఇంకా ఏవేవో తెచ్చి నైవేద్యం పెడ్తుంటారు. తర్వాత వాటిని అక్కడే అమ్ముతుంటారు. మహారుచిగా ఉంటుందిలెండి. ఇంటికి పట్టుకెళ్ళాలనుకునే వాళ్ళ కోసం రెణ్ణెళ్ళ వరకూ నిలవుండే డ్రై ప్రసాదాలు కూడా ఉన్నాయి. రామకృష్ణ పరమహంస అన్నారట City of Varanasi, Dust of Vrindavan and Prasad of Puri are unparalleled అని. నే విన్నదాని ప్రకారం ఆ రోజు మిగిలిపోయిన ప్రసాదాన్నంతా మరుసటి రోజు ప్రసాదంలో కలిపేస్తారట. ఇలా చైతన్య మహాప్రభు టైమునుంచీ జరుగుతోందట. అందుకే సర్వం జగన్నాథం అంటారట. ఎవరేమనుకున్నా మహనీయులు ఎంగిలిపడ్డ ప్రసాదాన్ని తింటున్నామన్న ఫీలింగ్ చాలా గొప్పగా అనిపించింది. అక్కడ ప్రసాదాన్ని చిన్నా పెద్దా, కుల వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసే తింటుంటారు. కానీ మత భేదాలు మాత్రం ఉన్నాయండోయ్. గుళ్ళోకి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం. ఆ మాత్రం దానికి జగన్నాథుడు అనడం దేనికి, హిందూనాథుడు అనొచ్చు కదా అనిపించింది కానీ ఎందుకొచ్చిన రిస్కని వెంటనే లెంపలేసుకున్నా.

...

సాయంత్రం చీకటి పడేముందు ఇద్దరు పూజారులు గోపురమెక్కి పైనున్న జెండాలను మారుస్తుంటారు. అంత ఎత్తున్న గోపురాన్ని ఏ protection లేకుండా ఎక్కడం చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. దాన్ని చూడ్డానికి, ఆ జెండాలను తీసుకోడానికి జనాలంతా గుడి చుట్టూ మూగి ఉంటారు.

...

రాత్రి పూరీలోనే పడుకుని పొద్దున ఇంకోసారి దర్శనం చేసుకుని తిరుగుప్రయాణమయ్యాను.


Related Posts